దిల్లీ: భారత్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని ప్రకటించిన ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో కీలక ప్రకటన చేసింది. రానున్న ఐదేళ్లలో భారత్ లో పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించింది. అమెజాన్ సొంతలాభం కోసం తప్ప భారత్ కోసం పనిచేయడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ కంపెనీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ మూడు రోజుల పర్యటనకు వచ్చిన సందర్భంగా భారత్ లో రూ.1వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. దీనిపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టినంత మాత్రాన భారత్ కు మీరేదో మేలు చేస్తున్నట్లు కాదంటూ పరోక్షంగా బెజోసనుద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బెజోస్ శుక్రవారం ఓ ప్రకటన చేశారు. 2025 నాటికి పది లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రణాళిక ఉందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఐటీ, నైపుణ్యాభివృద్ధి, కంటెంట్ క్రియేషన్, రిటైల్, లాజిస్టిక్స్, తయారీ పరిశ్రమల్లో ఉద్యోగాలు సృష్టించనున్నట్లు బెజోస్ పేర్కొన్నారు. గత ఆరేళ్లలో అమెజాన్ పెట్టుబడుల ద్వారా 1 లక్షల మందికి ఉపాధి లభించిందని, రానున్న ఐదేళ్లలో కల్పించే ఉద్యోగాలు దీనికి అదనమని వివరించారు.